Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

గీతాసందేశం

ధర్మరాజు పాండవులలో అగ్రజుడు, ధర్మపుత్రుడు, యుధిష్ఠిరుడు అని ఆయనకు నామాంతరములు. ఆయన చేతిలోని శంఖమునకు అనంత విజయ మని పేరు. అంటే అంతులేని భటులను జయించే దని అర్థము. అర్జునుని చేతిలో ఉన్న శంఖమునకు దేవదత్తమనిపేరు. భీముని శంఖము, పౌండ్రము, పాండవులకు, కౌరవులకు మధ్య ధర్మక్షేత్రంలో, కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది. అందరూ తమ తమ శంఖములను పూరించినారు. ఆ రోజు ఏకాదశి, శంఖములను పూరించగానే ఆకాశమూ భూమి నిండిన మహాధ్వని దుర్యోధనాదులకు హృదయం విదారకంగా ప్రతిధ్వనించింది.

సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయానివ్యదారయత్‌ |

నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్‌ ||

నకులుని శంఖమునకు సుఘోషమని పేరు. ఆ శంఖం మంచిఘోషను చేసే దన్నమాట. సహదేవుని శంఖంపేరు మణి పుష్పకం. ఐదుగురి చేతులలో ఐదు శంఖాలు. శ్రీ కృష్ణ పరమాత్మ ఆరవవాడు. ఆయన శంఖము పాంచజన్యము. ఈ అయిదుగురి శంఖములతో సమానము పాంచజన్యము.

చేపలవలె నీటిలో వుండే ప్రాణి శంఖము. ఆ ప్రాణి శంఖంలో వున్నపుడు కదులుతూ వుంటుంది. మనకు పైన చర్మమూ, లోన మాంసమూ, ఆస్థులూ ఉండగా శంఖమునకు, బయట అస్థి లోపల మాంసము ఉంటుంది. సముద్రంలో ఉన్న పంచజనమనే శంఖమును బయటికి తెచ్చి భగవంతుడు తన యుద్ధ ఘోషకు ఉపయోగిస్తున్నాడు. పంచజనునకు సంబంధించినది కనుక దానికి 'పాంచజన్యమని పేరు'.

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః |

పౌండ్ర దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |

నకుల స్సహదేవశ్చ సు ఘోష మణి పుష్పకౌ ||

అందరూ వారి వారి శంఖములను యుద్ధప్రారంభ సూచకముగా పూరించారు.

'శంఖాస్థి పావన మ పావన మస్థి మాణాం '-

శంఖముయొక్క అస్థి పవిత్రము. అది ఒక పురుగు యొక్క ఎముక ఐనా ఈశ్వరాభిషేకంలో వినియోగపడు తున్నది. సహస్రశంఖాభిషేకం అంటే చాల విశేషం.

పురుగులకంటే మానవులు ఎన్నో రెట్లు శ్రేష్ఠులు. అందులో చదువుకొన్నవారు గొప్ప. వారిలో యజ్ఞయాగాదులు చేసినవారు అంటే మరింత ఉన్నత స్థానం. ఇంత గొప్ప వారుకదా అని వారి ఎముకలను ముట్టుకొంటా మంటే వీలు లేదు. ఆ ఎముకలను తాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాని ఒక పురుగు యొక్క ఎముక పవిత్రమై పూజాపరికరంగా అమరిపోయింది. పరమ పవిత్రుడైన ఒక సోమయాజిని యజ్ఞ దీక్షలో ఉండగా తాకితే, తాకినవారు స్నానం చేయాలి. సోమయాజి చేయనక్కరలేదు. వారికి అశుద్ధిలేదు. తాకిన వారికే అశుద్ధి.

అట్టి పరమపవిత్రమైన శంఖాన్ని అయిదుగురు ఘోషించారు. ఆరోజే గీతకూడ పుట్టింది. ఆ గీతా ఘోషము నేటికీ జరుగుతూ వున్నది. ఈరోజు గీతాజయంతి. భగవద్గీతకు దాదాపు ఐదువేల జయంతులు జరిగినవి. అసలు భగవద్గీతకు నిత్యమూ జయంతియే- రోజూ జయంతిని చేయడముకుదరదు. కనుక ఏదో ఒక రోజును నిర్దేశించుకొన్నాము.

ధర్మక్షేత్రంలో, కురుక్షేత్రంలో కూడిన మావారికీ, పాండవులకూ మధ్యఏమి జరిగిందని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు. సంజయ అంటే సర్వోత్కరేణజయ- అన్ని విధముల జయము పొందుము అని అర్థం. మన హృదయాలలోనూ రోజూ ఒక మహాభారత యుద్ధం జరుగుతూనే వుంటుంది. ఒక చిత్తవృత్తి మంచి పనిని చేయమని చెప్పుతుంది. మరొక చిత్తవృత్తి తప్పుడు పనిని చేయమంటుంది. ధర్మక్షేత్రంలో, యుయుత్సవః- యుద్ధముకోసము, మావాళ్లూ, పాండవులూ కలిసినారుకదా? వాళ్ళేమి చేశారని అంధుడు ధృతరాష్ట్రుడు- సంజయుణ్ణి అడుగుతున్నాడు.

క్షేత్రం అన్న మాటకు హిందీలో సస్యభూమి అని అర్థం. మంచిపంటలు పండే భూమికి క్షేత్రమని పేరు. 'ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిత్య భిధీయతే'- ఈ శరీరము ధర్మమనే పంట పండే క్షేత్రమని, భగవంతుడు చెప్పుతున్నాడు- 'మామకాః' అంటే మమకార వృత్తులు. 'పాండవాః' అంటే హంసరెక్కలవలె స్వచ్ఛంగా తెల్లగా వుండేవారు- పదునెనిమిది ఆధ్యాయముల గీతాసారమూ ఈ మొదటి శ్లోకంలోనే వున్నది. మొదటిశ్లోకం మంగళ శ్లోకం. దానిని, ఆశీర్వాద రూపంగా దేవతానమస్కారంగా, వస్తునిర్దేశ తాత్పర్యంగా- మూడువిధాలుగా చెప్పవచ్చును.

'ఆశీర్న మస్క్రియా వస్తు నిర్దేశోవా పి తన్ముఖం'

ధర్మమనే సస్యము పండేదానికి అనుకూలంగా వుండేదే ధర్మక్షేత్రం. సన్‌ అంటే ఏమి? ఈశ్వరుడున్నాడనే నమ్మకం; మమతను విడిచి పరోపకారం చేయడం, 'పరోపకారార్థ మిదం శరీరం'- ఈ ధర్మక్షేత్ర మైన శరీరం పరోపకారార్థమే. శ్రీకృష్ణపరమాత్మ బాల్యమాదిగా పరోపకారార్థమే పాటు పడుతూ వచ్చారు. యుద్ధంలో ఆయన అర్జునుడికి సారథ్యం వహించారు. సాయంత్రం మయ్యేసరికి, రథాశ్వములనురథం నుంచి విప్పి, వీపుతట్టి, నీరు త్రాగించివాని శ్రమను పోగొట్టే వారు. 'పాండవ స్యందనాశ్వాన్‌'- 'నమేపార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన'- అంటూనే ఆయన అశ్వాలను బుజ్జగిస్తున్నారు. మనకూ కష్టాలూ, బాధలూ ఎన్నో వుంటవి. ఎన్నివున్నా అన్నీ మరచి, నీరు త్రాగుతూవున్న అశ్వముల ప్రక్క నిలుచుకొని యున్న కృష్ణపరమాత్మను స్మరిస్తూ పరోపకారం చేయాలి.

కిమకుర్వత? అంటే ఏమోచేశారు. ప్రతిశరీరంలోనూ చెప్పరానివి ఎన్నో జరుగుతూనే వుంటుంది. కిమకుర్వతఅనేది సమస్త పదమైతే తప్పు చేశారని అర్థం. కిం అకుర్వత అని వ్యస్తమైతే ఏమో చేశారు, ఏమీ ప్రయోజనం లేదని అర్థం. జ్ఞాని అందరియందు, సమబుద్ధిర్విశిష్యతే- సమాన బుద్ధితో ఉండాలి.

అందరియందు స్నేహ భావంతో ఉండవలె నన్నదే గీతా తత్త్వం.

భోక్తారం యజ్ఞ తపసాం సర్వభూత మహేశ్వరం |

సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిమృచ్ఛతి||

మహేశ్వరుడు, సర్వభూతములకు- సుహృత్తుగా ఉంటున్నాడు. ప్రత్యుపకారమును అపేక్షించక ఉపకారము చేసేవాడు సుహృత్‌. ''ప్రత్యుపకార నిరపేక్షతయా ఉపకారిత్వాత్‌'' ఈశ్వరుడు సర్వ భూతములకు మిత్రుడు. ప్రభుత్వం కంటే మిత్రత్వంలోనే ఆనందం ఎక్కువ. లోకంలో ఎవరైనా ఒకరు అందరికీ సుహృత్తుగా వుంటే- అతనిని చూడగానే మనకు శాంతి కలుగుతుంది. ఈశ్వరుని సుహృదత్వం మనకు హృదయంగం ఐతే వెంటనే శాంతి లభిస్తుంది. శాంతి వుంటేనే సుఖం. 'అశాంతస్య కుతః సుఖం?'

ఈశ్వరుడు సృష్టికర్త, సంహర్త కావటమే కాక సుహృత్తుకూడ. నాయందు ఒకనికి గొప్పభక్తి ఉన్నదను కొందాం. నేను వానిని రాయి తీసుకొని నెత్తిని కొట్టితే- నెత్తురువచ్చి బాధపడుతున్నా- అదే అనుగ్రహమని అనుకొంటాడు. అదే మరొకడు కొడితే వానికి కోపం వస్తుంది. ఎందువల్ల? నా పైన భక్తిచేత, సుహృద్భావంచేత. పరమాత్మ మనకు సుహృత్తు అన్న విశ్వాసమే మనకు సుహృత్తు. ఈ ఉపదేశాన్ని రెండుమాటలు చదివినాచాలు. గొప్ప మనశ్శాంతి వస్తుంది. గంగాజలం ఒక గుటిక. ఆచమనం చేసినాచాలు. ''భగవద్గీతా కించిదధీతా- గంగాజల లవకణికాపీతా-'' రెండు శ్లోకాలైనాచాలు. గీతా గ్రంథమే ఒక సుహృత్తు; దానిని బోధించిన పరమాత్మ అంతకంటే సుహృత్తు.

గీతలో భగవంతుడు అర్జునుడికి హింస చేయమని బోధిస్తున్నాడు. గురువులను బంధువులను అందరినీ చంప మంటున్నాడు. యుద్ధం చేసితీరాలి- 'కురుశర్మ ఏవ తస్మాత్వం' అని ప్రబోధిస్తున్నాడు. శిష్యుడేమో- గురువుకు అహింసా ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తున్నాడు ! ''కృష్ణా! గురువులను బంధువులను చంపి దాని మూలకంగా వచ్చిన రాజ్యమును అనుభవించటం నాకు ప్రియంకాదు. నేను భిక్షమైనా ఎత్తుకొని బ్రతుకుతాను కాని, యుద్ధం మాత్రం చేయను'' అని అర్జునుడు నొక్కి చెప్పుతున్నాడు.

''నేను వీళ్ళనందరినీ ఎన్నడో చంపివేశాను. 'మయా హతాః పూర్వమేవైతే'- నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్‌' నీవు పేరుకు మాత్రం యుద్ధంచేయి. నేను యుద్ధం చేయమని చెప్పుతుంటే- నీవు పెద్ద తెలివిగల వాడివలె మాట్లాడుతున్నావే?' 'ప్రజ్ఞావాదాంశ్చభాషసి' నామాట వినకపోతే- 'వినశ్యసి'- నాశనమౌతావు'', అని విచిత్రంగా గురువు శిష్యుణ్ణి శపిస్తున్నాడు !

అంటే స్పృహ- కామం, క్రోధం, ద్వేషం, రాగం- వీని మూలంగా ఏ పని జరిగినా పాపం. అది చేయకూడదు. తిట్టటం, కొట్టటం, దొంగతనం చేయడం- ఇవి సామాన్యంగా పాపకార్యములైనా, కొన్ని సందర్భములలో ఇవి పాప కార్యాలు కాకపోవచ్చును కూడ.

'యస్య నాహంకృతో భావో బుద్ధి ర్యస్యనలిప్యతే'-

అహంకార బుద్ధిలేకుండా, స్పృహలేకుండా ఈ పనులు జరిగితే అవి పాపంక్రింద రాదు.

'హత్వాపి సఇమాన్‌ లోకాన్‌ సహంతి ననిబద్ద్యతే'-

ఏది చేసినా శాంతముతో, పరోపకారబుద్ధితో, ధర్మం కోసం, లోకసంగ్రహణార్థం-

'లోకసంగ్రహమేవాపి సంపశ్యన్‌ కర్తుమరసి'- చేయాలి.

ఇదే భగవంతుని సందేశం. గీతా సందేశం. గీతా ఘోష. పాంచజన్య నినాదం. ఉపదేశమంతా అయిన తర్వాత కృష్ణపరమాత్మ-

'కశ్చి దజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ?'

''నాయనా ! నిన్ను ఆవరించిన శోకం, మోహం తొలగిందా అని అడుగగా'', అర్జునుడు-

'నష్టోమోహః స్మృతిర్లబ్ధా త్వత్ర్పసాదాన్మయాచ్యుత

స్థితస్మిగత సందేహః కరిష్యే వచనంతవ ||''-

''నీవు చెప్పిన మాటను, సందేశాన్ని ఆలకించి, నీవు చెప్పినట్లు చేస్తాను''- ''కరిష్యే వచనంతవ'- అని బదులు చెప్పుతున్నాడు. ఆ చివరి వాక్యమే గీతా సందేశం. అదే గీతా జయంతి; అదే భగవంతుని శంఖారావం.


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page